This Day in History: 1924-05-07
1924 : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, తిరుగుబాటుదారుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే ప్రాణాలర్పించిన యోధుడు. 27 ఏళ్ళ వయసులో నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేసి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు. కృష్ణదేవిపేట (కే.డి పేట)లో ఆయన సమాధి ఉంది.
