This Day in History: 1946-06-25
1946 : ప్రపంచ బ్యాంకు ఏర్పాటై, కార్యకలాపాలు మొదలు పెట్టింది.
ప్రపంచ బ్యాంకు అనేది ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పురోభివృద్ధికై ధన సాయం చేసేందుకు గాను ఏర్పాటయిన సంస్థ ఇది. 1945 డిసెంబర్ 27 న ఏర్పాటై, 1946 జూన్ 25 న కార్యకలాపాలు మొదలు పెట్టింది. ఇది మూలధన ప్రాజెక్టులను చేపట్టే ఉద్దేశంతో పేద దేశాల ప్రభుత్వాలకు రుణాలు గ్రాంట్లను అందిస్తుంది. ప్రపంచబ్యాంకు ప్రధానంగా మానవాభివృద్ధి (విద్య, ఆరోగ్యం మొదలైనవి), వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతులు, ప్రభుత్వ రంగం వంటి రంగాలపై దృష్టి కేంద్రీకరించి ఉంటుంది. పేదరికం తగ్గింపును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రపంచ బ్యాంకు ఇటీవల ప్రకటించింది . రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దేశ పునర్నిర్మాణానికై 1947 మే 9 న ఫ్రాన్సుకు మంజూరు చేసిన 250 మిలియను డాలర్లు, బ్యాంకు అందించిన మొదటి ఋణం.
ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబిఆర్‌డి), ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఐడిఎ) అనే రెండు సంస్థల కలగలుపు. ఈ ప్రపంచ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు గ్రూపులో ఒక భాగం.
ప్రపంచ బ్యాంకు గ్రూప్ అనేది ఐదు అంతర్జాతీయ సంస్థలతో కూడిన కుటుంబం. ప్రపంచ బ్యాంకుకు అది మాతృ సంస్థ. ఆ ఐదు సంస్థల్లో మొదటి రెంటినీ (ఐబిఆర్‌డి, ఐడిఎ) కలిపి ప్రపంచ బ్యాంకు అని అంటారు. ఆ ఐదు సంస్థలు:
- ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబిఆర్‌డి)
- అంతర్జాతీయ అభివృద్ధి సంఘం (IDA)
- ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC)
- మల్టిలేటరల్ ఇంవెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ (MIGA)
- ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ (ICSID)
ఆ ఐదు సంస్థల్లోను, IBRD, IDA లు సభ్య దేశాలకు తక్కువ రేట్లకు ఋణాలు ఇస్తాయి. నిరుపేద దేశాలకు గ్రాంట్లను మంజూరు చేస్తాయి. ప్రాజెక్టులకిచ్చే ఋణాలు, గ్రాంటులు సదరు రంగాల్లో లేదా ఆర్థిక వ్యవస్థలోని విధానాల్లో చెయ్యవలసిన మార్పులతో లింకు పెట్టడం జర్గుతూ ఉంటుంది. IFC ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెడుతుంది. MIGA ఇన్స్యూరెన్సు సేవలు అందజేస్తుంది.