This Day in History: 2009-06-27
2009: న్యాయ శాస్త్ర కోవిదుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి ఏరాసు అయ్యపురెడ్డి మరణం
ఏరాసు అయ్యపురెడ్డి (జనవరి 15, 1924 – జూన్ 27, 2009) ప్రముఖ న్యాయ శాస్త్ర కోవిదుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏరాసు అయ్యపురెడ్డి, న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు.
కర్నూలు జిల్లాలోని గడివేముల మండలం గడిగరేవుల గ్రామంలో జన్మించిన అయ్యపురెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్‌గా, రాజ్యాంగ నిపుణుడిగా పేరొందాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన కర్నూలు నుంచి లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించాడు. లోక్‌సభలో పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు కూడా నిర్వహించాడు. ఈయన కుమారుడు ఏరాసు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీశైలం శాసనసభ్యుడు.
1978 లో జనతా పార్టీ తరపున అరవై మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాని వారిలో చాలా మంది పార్టీని వదలి వెళ్లిపోయారు. అ క్రమంలో పార్టీలో చీలిక కూడా వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న గౌతు లచ్చన్న లోక్ దళ్ పార్టీ వైపు వెళ్లగా జనతా పార్టీ తరఫున అయ్యపు రెడ్డి కొంతకాలం విపక్ష నేతగా వ్యవహరించాడు.
కాని అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఈయనతో సంప్రదింపులు జరిపి మంత్రి పదవి ఇవ్వడంతో అయ్యపురెడ్డి జనతా పార్టీని వదలి అధికార పార్టీ అయిన కాంగ్రేస్లో చేరి మంత్రి అయ్యాడు. అంతకుముందు అయ్యపురెడ్డి కాంగ్రెస్ నేతే. కానీ 1978 పరిణామాలలో కాంగ్రెస్ ను వదలి జనతా పార్టీ తరపున పోటీచేశాడు. ఆ తర్వాత కాలంలో ఆయన మళ్లీ కాంగ్రెస్ ను వదలి తెలుగుదేశం పార్టీలో చేరి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డిని లోక్ సభ ఎన్నికలలో ఓడించి సంచలనం సృష్టించాడు.
రెండు సంవత్సరాలుగా అస్వస్థతతో ఉన్న అయ్యపురెడ్డి 89 సంవత్సరాల వయసులో, ఆరోగ్యం క్షీణించి 2009, జూన్ 27 న మరణించాడు.