This Day in History: 1864-06-29
1864: బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త అశుతోష్ ముఖర్జీ జననం
అశుతోష్ ముఖర్జీ (జూన్ 29, 1864 – మే 25, 1924) బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త. గణితం, సైన్సు, న్యాయశాస్త్రం లాంటి పలు రంగాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త కూడా.
బాల్యం, విద్యాభ్యాసం: బాల్యం నుంచే అశుతోష్ చదువులో మంచి ప్రతిభ కనబరచాడు. సౌత్ సబర్బన్ స్కూల్లో చేరి 1879లో కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క మెట్రిక్యులేషన్ పరీక్షలో రెండవ స్థానంలో నిలిచాడు. తరువాత ప్రెసిడెన్సీ కళాశాలలో చేరి 1881లో F.A పరీక్షలో మూడవ స్థానంలో నిలిచాడు. 1884లో బి.ఏ డిగ్రీలో యూనివర్శిటీలోనే ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత సంవత్సరమే గణితంలో M.A మొదటి స్థానంలో నిలిచాడు. తరువాత సైన్సులో M.A కొరకు, ప్రేమ్‌చంద్-రాయ్‌చంద్ ఉపకార వేతనం కొరకు మళ్ళీ పరీక్ష కోసం సిద్ధమై వయసు చాలక వాటిని మద్యలోనే వదిలేశాడు. అది అలా ఉండగానే సిటీ కాలేజీలో లా చదివి దానికి సంబంధించిన మూడు పరీక్షల్లో ప్రథముడిగా నిలిచాడు.
వృత్తి: అశుతోష్ గణితంలో ప్రతిభావంతుడైనప్పటికీ కలకత్తా విశ్వవిద్యాలయంలో నిధులు చాలకపోవడం వలన (సంవత్సరానికి 9000 రూపాయలు) ఆయన్ను ఆచార్యుడిగా నియమించలేక పోయారు. దాంతో ఆయన 1888 లో న్యాయవాద వృత్తి చేపట్టాడు. 1904 లో కలకత్తా హైకోర్టుకు న్యాయమూర్తి అయ్యాడు. 1906 నుంచి 1914 వరకు కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్‌లర్ గా వ్యవహరించాడు. ఆయన నేతృత్వంలో కలకత్తా విశ్వవిద్యాలయం అధునాతన సౌకర్యాలను సమకూర్చుకుని ఇతర భారతీయ విశ్వవిద్యాలయాలకు ఆదర్శంగా నిలిచింది.
మరణం:
1924 మే 25 న అకస్మాత్తుగా మరణించాడు.